ఓటమి జీర్ణించుకోలేక ప్రత్యర్థుల దాడి
సర్పంచ్ కవిత భర్త భరత్ కుమార్‌పై దాడి
బిఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పనిచేసిన భరత్ కుమార్
మన తెలంగాణ/పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ సర్పంచ్‌గా గెలుపొందిన కవిత భర్త భరత్ కుమార్‌పై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ భరత్ కుమార్, ప్రస్తుతం గెలుపొందిన వార్డు సభ్యులపై దాడికి పాల్పడినట్లుగా భరత్ కుమార్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ భార్య బిఆర్ఎస్ మద్దతుతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ నాయకులే తమపై దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ సైతం ఇదివరకు బిఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన సతీమణి గెలుపొందడంతో ప్రత్యర్థి వర్గీయులు దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.