నల్లగొండ: బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు డ్రైనేజీ కాల్వలో కనిపించిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఆర్ఒను కలెక్టర్ సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నకాపర్తి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఓ డ్రైనేజీ కాల్వలో కనిపించడంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు. గ్రామస్థుల సమాచారం మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేపర్లను బయటకు తీసుకొచ్చిన తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేజ్ టు ఆర్వోను సస్పెండ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీవోను అధికారికంగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డిఒ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓడిపోతామని ముందే తెలిసి రిగ్గింగ్ కు పాల్పడి ఉంటారని బిఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. రిగ్గింగ్ కు ఎన్నికల సిబ్బంది సహకరించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ లో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు బయటకు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులు డబ్బులు తీసుకొని ఈ దారుణానికి పాల్పడిన ఉంటారని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.