పుణె: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్ సూపర్ లీగ్ గ్రూప్‌బి మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. శుక్రవారం పుణెలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 18.5 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29), వికెట్ కీపర్ హార్దిక్ తమోర్ (29), సూర్యాన్ష్ షెడ్గె (28) తప్ప మిగతా వారు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు.
అద్భుతంగా రాణించిన సిరాజ్ 3.5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. కెప్టెన్ చామ మిలింద్, తనయ్ త్యాగరాజన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 11.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అమన్ రావు, తన్మయ్ అగర్వాల్ జట్టుకు విధ్వంసక ఆరంభాన్ని అందించారు. చెలరేగి ఆడిన తన్మయ్ 40 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అమన్ రావు 29 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఐదు బౌండరీలతో 52 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది.