దుబాయి: ఆసియా అండర్19 వన్డే కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు 234 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎఇ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 199 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవి చూసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో యుఎఇ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితంచేశారు. యుఎఇ టీమ్‌లో ఉద్దిశ్ సురి అజేయంగా 78 పరుగులు చేశాడు. పృథ్వీ మధు (50) పరుగులు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో దీపేశ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
సూర్య వీర విహారం..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా తిగిన కెప్టెన్ అయుష్ మాత్రే (4) ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన అరోన్ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. అరోన్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా సూర్యవంశీ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. యుఎఇ బౌలర్లను హడలెత్తించిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ 55 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. ఇదే సమయంలో అరోన్ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 146 బంతుల్లోనే 212 పరుగులు జోడించాడు. జార్జ్ (69) పరుగులు చేశాడు. ఇక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 95 బంతుల్లోనే 14 సిక్సర్లు, 9 ఫోర్లతో171 పరుగులు సాధించాడు. ఇక విహాన్ మల్హోత్ర (69), వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ 32 (నాటౌట్) కనిష్క్ (28) పరుగులు చేశారు. దీంతో భారత్ 433 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న 425 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టింది.