అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సరికొత్త ‘జాతీయ భద్రతా వ్యూహం’ డాక్యుమెంట్‌పై ప్రపంచమంతటా చాలా ఆసక్తిని రేకెత్తించింది. ప్రత్యేకంగా యూరప్‌తో పాటు, అమెరికాకు సంప్రదాయికంగా సన్నిహితమైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా వంటి సుదూర దేశాలలోనైతే పెద్ద కలకలాన్ని సృష్టించింది. అమెరికా మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను భయపెట్టింది. ఈ ప్రభావాలను గమనించి కూడా ట్రంప్ తన డాక్యుమెంట్‌లో చెప్పిన వైఖరిని మార్చుకోకపోగా, ఇతర దేశాల పరిస్థితి, భవిష్యత్తు ఏ విధంగా ఉన్నప్పటికీ, తమ భవిష్యత్తు కోసం ఈ కొత్త వైఖరి తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు.
ఇంతకూ ఆ డాక్యుమెంట్‌లో ఏమున్నది? దాని ప్రభావాలు ఈ విధంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నలను చర్చించే ముందు కొన్ని మౌలికమైన విషయాలను చెప్పుకోవాలి. అమెరికా, యూరప్, ఇతర దేశాలతో కూడిన పాశ్చాత్య కూటమి, నాటో సైనిక కూటమి పరిస్థితి ఒకప్పటి వలే లేదు. అవి ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా సుమారు 2010 వరకు మొత్తం ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని సాగించాయి. ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్, దానితోపాటు వార్సా సైనిక కూటమి పతనంతో వారికి ఎదురు లేకుండా పోయింది. అది, అంతకు ముందటి ద్విధ్రువ (అమెరికా, సోవియెట్ యూనియన్ రెండు ధ్రువాలుగా) ప్రపంచానికి బదులు కేవలం అమెరికా నాయకత్వాన ఏక ధ్రువ ప్రపంచంగా పరిణమించిన కాలం. కాని సుమారు 2010 వచ్చే సరికి ఆ దశ మారటం మొదలైంది. వ్లాదిమిర్ పుతిన్ బలమైన నాయకత్వంతో రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైంది. మరొక వైపు చైనా కొత్త శక్తిగా ఆవిర్భవించింది. ఆ విధంగా మరొక దశాబ్దం గడిచే నాటికి, రష్యా, చైనాలు ఆర్థికంగా, సైనికంగా కూడా అమెరికా కూటమికి సవాలుగా మారసాగాయి. అమెరికాకు గల బలాలలో శాస్త్ర సాంకేతిక రంగం కూడా ముఖ్యమైనది కాగా, రష్యా కాకపోయినా చైనా అత్యాధునికమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో అమెరికాకు సాటిగా ఎదగటమే గాక, కొన్ని రంగాలలో అంతకుమించి పోయింది.
ఒకవైపు ఇది జరుగుతుండగా, మరొక వైపు ప్రపంచ వ్యాప్తంగా మరొక విధమైన పరిణామాలు చోటు చేసుకోసాగాయి. అవి బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు. ఇండియా, ఆసియాన్ కూటమి, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, నైజీరియా, కొన్ని అరబ్ దేశాల వంటివి స్వయంగా బలపడుతూ, ఏ కూటమితో నిమిత్తం లేకుండా, స్వతంత్రంగా నిలబడి తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిచటం మొదలు పెట్టాయి. అమెరికా కూటమికి ప్రత్యామ్నాయంగా రష్యా, చైనాలు తమకు చేయూత అందిస్తుండటంతో వారి ధైర్యం మరింత పెరగసాగింది. దానితో, అమెరికా ఆదేశాలను గతంలో వలే శిరసావహించే దశ తప్పిపో సాగింది. ఇటువంటి కొత్త పరిస్థితుల మధ్య బహుళ ధ్రువ ప్రపంచం అనే మాట విస్తరించసాగింది. ఈ మార్పుల ఫలితమే బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటివి. అదే పద్ధతిలో ఐక్యరాజ్య సమితిని, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలను అమెరికా నియంత్రణ నుంచి విముక్తం చేసి ఇతర దేశాలకు సమాన భాగస్వామ్యం, హక్కులు కల్పించాలనే వాదనలు పెరుగుతుండటం.
ఈ నేపథ్యాన్ని అంతా ఇంతగా వివరించటం ఎందుకంటే, ఈ పరిణామాలు సృష్టించుతున్న ఒత్తిడుల ప్రభావం వల్లనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు తమ జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకోక తప్పటం లేదు. అది ఇపుడీ డాక్యుమెంట్ రూపంలో ముందుకు వచ్చినా, వాస్తవానికి ఇంతకు ముందే అందుకు ఆరంభం ట్రంప్ ఇచ్చిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాద రూపంలో కనిపించింది. అందుకు ఈ డాక్యుమెంట్ కొనసాగింపని స్వయంగా ట్రంప్ బృందం చెప్తున్నదే. వారు బహిరంగంగా ఒప్పుకోని విషయం, పైన పేర్కొన్న పరిణామాల ఒత్తిడి. అసలు ఆ నినాదమే చెప్తున్నదేమిటి? అమెరికా ఒకప్పుడు ‘గొప్పగా ఉండేది. ఆ గొప్పతనాన్ని ఇపుడు కోల్పోయింది. ఆ స్థితిని ‘తిరిగి’ సాధించాలని. ఆ ‘గొప్పతనం’ అంటే ఏమిటి? దానిని కోల్పోవటం ఎందువల్ల జరిగింది? తిరిగి సాధించటం ఏ విధంగా? ఈ విషయాలను మాత్రం వారు దాపరికం లేకుండా వివరించరు. అమెరికా గొప్పతనం పోవటం ట్రంప్ ‘మాగా’ నినాదం ఇచ్చిన 2017 నాటికే మొదలైంది. అందుకు కారణాలు పైన పేర్కొన్నవే. ఆ కారణాలు 2017 కన్న ఇప్పటికి గత ఏడేళ్లలో మరింత తీవ్రమయ్యాయి. వర్తమాన పరిస్థితులను బట్టి చూడగా మునుముందు ఇట్లానే తీవ్రమవుతూ పోగలవని చెప్పటం కష్టం కాదు. ఈ అంచనాలు ఆందోళన కలిగించటం వల్లనే ట్రంప్ బృందం పై డాక్యుమెంట్‌ను రూపొందించిందనాలి.
మరి గొప్పతనాన్ని తిరిగి సాధించటం ఎట్లాగన్నది చివరి ప్రశ్న. ఆ వ్యూహాన్ని అమలు పరచటం ఈ డాక్యుమెంట్‌తో నిమిత్తం లేకుండానే ట్రంప్ ఈ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమలు పరుస్తున్నారు కూడా. ఇక యుద్ధాలు చేయకపోవటం, ఇతరుల యుద్ధాలు కూడా మాన్పించటం, బయటి వారిని పంపివేయటం, కొత్తవారిని రానివ్వకపోవటం, బయటి దేశాల పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించటం, బయటకు పోయిన అమెరికన్ కంపెనీలను తిరిగి రప్పించటం, పేద దేశాలకే గాక అమెరికన్ కూటమి దేశాలకు సైతం ఉచిత సహాయాలు ఆపటం, అక్కర లేదనుకునే ఉద్యోగాల రద్దు, అన్ని దేశాలపై విపరీతంగా సుంకాల పెంపు, తమ ఉత్పత్తులు కొని తీరాలని ఇతరులపై ఒత్తిడి వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇటువంటి చర్యల వల్ల ట్రంప్ లక్షాలు నిజంగా నెరవేరుతాయా అనే దానిపై అమెరికన్ నిపుణులలోనే సందేహాలున్నాయి.
కనుక, చివరకు ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చునో ఇంకా స్పష్టత లేకపోయినా, అదే ‘మాగా’ లో భాగంగా ఇప్పుడు ప్రకటించిన కొత్త డాక్యుమెంట్ నిజానికి స్వభావ రీత్యా కొత్తదేమీ కాదు. కాని అందులోని తీవ్రతలు, స్పష్టతలు కొత్తవి. ఇటువంటి తీవ్రతలే అమెరికా మిత్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆ డాక్యుమెంట్‌లోని కొన్ని అంశాలను చూద్దాం. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థిక, సైనిక భారాలే తప్ప ప్రయోజనం లేదనుకున్న ట్రంప్ దానిని ఆపే ప్రయత్నాలు మొదటి నుంచి చూస్తూ రాగా, అందుకు కలిసి రాని ఉక్రెయిన్, యూరప్‌లపై ఇప్పుడు తుది హెచ్చరికలనదగ్గవి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా యూరప్ గురించి అయితే, అసలు వారి విధానాల కారణంగా యూరోపియన్ సంస్కృతి, వ్యక్తిత్వం, శక్తి ప్రపత్తులు, స్వాతంత్య్రం అన్నవే క్రమంగా అంతర్ధానమయ్యే పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నారు. అవి నిలిచి ఉండడం కోసమంటూ అక్కడి తమ తరహా మితవాద పార్టీలను బాహాటంగా సమర్థిస్తున్నారు. అనగా తమ వలెనే అందరూ తక్కిన ప్రపంచంతో సంబంధాలను తగ్గించుకుని ఎవరికి వారుగా వ్యవహరించటమన్న మాట. ఇంత కాలం వలె మొత్తం యూరోపియన్ దేశాలన్నీ ఒక యూనియన్‌గా కొనసాగటం కూడా వృథా అన్నది ఈ డాక్యుమెంటు సూచన. దీనితో అక్కడి మితవాద పార్టీలలోనూ కొన్ని ఏకీభవించటం లేదన్నది, యూరప్‌కు సహజ సంప్రదాయమనుకునే ఉదారవాద ప్రజాస్వామిక విలువలను వదులుకోవటం వారికి ఇష్టం లేదన్నది వేరే విషయం. అయినా ఈ ప్రతిపాదనలు చేస్తున్న ట్రంప్ బృందం, ఇందుకు కొనసాగింపుగా, ఇకపై ఆయా దేశాల భద్రతను అవే చూసుకోవాలి తప్ప ఇంత కాలం వలే అమెరికాకు సంబంధం ఉండదని చెప్పటం వారిని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు సూచనప్రాయంగా చెప్తూ వచ్చిన ఈ మాట ఇప్పుడు డాక్యుమెంట్ రూపంలోకి వచ్చింది. ఆ మేరకు ఇంకా విధానాలనైతే రూపొందించలేదు గాని త్వరలో ఆ పని కూడా జరగవచ్చునన్నది అంచనా.
సరిగా ఇదే వైఖరి ఉక్రెయిన్ విషయంలోనూ కనిపిస్తున్నది. అందుకే పలు ప్రతిపాదనలతో ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్‌తోపాటు యూరప్‌పైనా ఒత్తిడిని తీవ్రంగా పెంచారు. ఉక్రెయిన్ తన భూభాగాలను రష్యాకు వదులుకోవటంతోపాటు ఇతరత్రానూ రష్యా షరతులకు తలఒగ్గేట్లు చేయబూనుతున్నారాయన. ఇప్పటికే స్వయంగా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడిన యూరప్‌కు దీనితో పాలుపోని పరిస్థితి ఎదురవుతున్నది. అదే సమయంలో మరొక స్థాయిలో ఆలోచించినప్పుడు, అమెరికాకు సంబంధించి గాని, యూరప్‌కు సంబంధించి గాని, కొంత కాలం నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ మౌలికంగా వారి ఉమ్మడి సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడటం వల్ల ఎదురయ్యే ఒత్తిడుల ఫలితమే.
టంకశాల అశోక్