రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
ఢిల్లీలో విలేఖరులతో ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగబోయే మెస్సీ ఫుట్‌బాల్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సిఎం మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్నారని, ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తనను కూడా ఒక అతిథిగా ఆ మ్యాచ్‌కు పిలిచారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదని సిఎం రేవంత్ వెల్లడించారు. ప్రపంచంలోనే ప్రముఖ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్నందున ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో కలిసిన రాహుల్‌గాంధీ, ప్రియాంకలను కూడా ఈ మ్యాచ్‌కు రావాలని పిలిచినట్లు సిఎం రేవంత్ చెప్పారు. గురువారం సాయంత్రం సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు.
మూడు రోజులపాటు భారత్‌లో మెస్సీ పర్యటన
‘గోడ్ ఇండియా టూర్ 2025’ పేరుతో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 13,14,15 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా 13వ తేదీన కోల్ కతా పర్యటన ముగించుకుని మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13వ తేదీ శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు లియోనల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యాచ్‌కు ఆయన హాజరవుతారు. కేవలం ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ కమిషనరేట్‌కు సంబంధించిన పోలీసులు సుమారు 2వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.