రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. అయితే ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకే ఓటేసేందుకు ఓటర్లకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఓ ఓటరు వచ్చిన ఓటేసేందుకు సిబ్బంది అనుమతించరు. అప్పటివరకూ పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటుహక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలింగ్ కేంద్రంలో ఐదుగురు ఓటర్లకు చేదు అనుభవం ఎదురైంది.
నిర్ణీత సమయం దాటడంతో ఎన్నికల సిబ్బంది వారిని లోపలికి అనుంతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరగడ తప్పలేదు. మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత ఓటు వేసేందుకు వచ్చిన ఐదుగురు స్థానిక ఓటర్లను పోలింగ్ కేంద్ర సిబ్బంది అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం పోలింగ్ సమయం ముగిసిందని, ఇక అనుమతించలేమని వారు స్పష్టం చేశారు. ఈ విషయమై ఓటర్లు, ఎన్నికల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటు వేయకుండా వెనుతిరగాల్సి రావడంతో ఆ ఐదుగురు ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ హక్కును అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేయగా సిబ్బంది మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సమయం పాటించామని బదులిచ్చారు.