మన తెలంగాణ /వేములవాడ రూరల్: రాష్ట్రంలో గురువారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో మరణించిన సర్పంచ్ అభ్యర్థి విజేతగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చెర్ల మురళి (50) అనే అభ్యర్థి బిఆర్‌ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గత గురువారం రోజున హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.
మరణించాక సర్పంచ్‌గా గెలిచిన చెర్ల మురళి
అయితే గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయనే సుమారు 700 పైచిలుకు ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో గెలిచిన అభ్యర్థి లేనందున ప్రస్తుతానికి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు. ఏం జరుగుతుందోనని గ్రామస్తులంతా ఉత్కంఠకు ఎదురుచూస్తున్నారు.