ఇతర దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు తెలిసింది ఒక్కటే.. భారీ సుంకాలు విధించడం. అంతకుమించి దౌత్యమార్గంలో చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కుందామనే ఆలోచనే ఆయనకు రాదనడానికి తాజా ఉదాహరణ భారత్ నుంచి తమ దేశానికి ఎగుమతి అవుతున్న బియ్యంపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడటం. రష్యానుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ, పరోక్షంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు ఆర్థిక వనరులు సమకూర్చి పెడుతోందన్న నెపంతో భారత్ పై ఇప్పటికే అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి కన్నెర్ర చేయడానికి కారణం.. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంవల్ల తమ రైతులు పండిస్తున్న సరకుకు గిరాకీ ఉండటం లేదని. అసలు ఇదంతా ఎలా మొదలైందంటే, మొన్న ట్రంప్ మహాశయుడు వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల స్థితిగతులపై శ్వేతసౌధంలో ఓ రౌండ్ టేండ్ సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో ఎవరో ఒక ప్రతినిధి లేచి భారతీయ వ్యాపారులు తమ బియ్యాన్ని అమెరికా మార్కెట్ లోకి కుమ్మరిస్తున్నారని, ఇలా దిగుమతి అవుతున్న బియ్యానికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
ఇంకేముంది.. ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెలిగక్కుతూ, బియ్యం దిగుమతులను అడ్డుకునేందుకు సుంకాల మోత మోగిస్తానంటూ వీరంగం వేశారు. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా సహా అనేక దేశాలకు ఏటా కోట్లాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటుంది.భారత్ కాకుండా థాయ్‌లాండ్, చైనా, ఇండొనేసియా వంటి దేశాలు కూడా అమెరికాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో సింహభాగం బాసుమతి బియ్యమే. బిర్యానీ తయారీలో ఉపయోగించే బాసుమతి బియ్యాన్ని పండించడంలో భారత్ పెట్టింది పేరు. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో భారత్ 337 మిలియన్ డాలర్ల విలువగల 2.75 లక్షల మెట్రిక్ టన్నుల బాసుమతి బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసింది.
బాసుమతియేతర బియ్యాన్ని మాత్రం 61 వేల మెట్రిక్ టన్నులే ఎగుమతి చేసింది. ఒకవేళ ట్రంప్ నిజంగానే భారత్ బియ్యం ఎగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో నష్టపోయేది అక్కడి వినియోగదారులే. ఎందుకంటే, భారత్ నుంచి బాసుమతి బియ్యం ఎగుమతులు ఆగిపోతే, అధిక ధరలు వెచ్చించి పాకిస్తాన్ వంటి ఇతర దేశాలనుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. ఇక అమెరికాలో పండే సాధారణ రకం బియ్యం నాణ్యతలో మన బియ్య ముందు తీసికట్టే. ఇక్కడ గమనించవలసిన మరొక విషయమేమిటంటే, అమెరికాకంటే పశ్చిమాసియా దేశాలకే భారత్ అధిక మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. మన బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా మూడు శాతం మాత్రమే. ఇవన్నీ అగ్రరాజ్యాధిపతికి తెలియవని అనుకోలేం. అమెరికా రైతుల్లో అధిక సంఖ్యాకులు ట్రంప్ మద్దతుదారులనేది బహిరంగ రహస్యం.వారికి ఊరట కలిగించేందుకు కంటితుడుపుగా ఆయన భారత్ పై ఆగ్రహం నటించి ఉండవచ్చుననే వాదన వినబడుతోంది.
ఇటీవల పుతిన్ భారత్‌కు రావడం, ఆయనకు ఇక్కడ ఘన స్వాగతం లభించడం కూడా ట్రంప్ కడపుమంటకు కారణం కావచ్చు. పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు ట్రంప్ ప్రతి విషయానికీ సుంకాల అస్త్రమే సంధించాలనుకుంటున్నారు. సుంకాలతోటే అందరినీ దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన సుంకాలు విధించడాన్ని కింది కోర్టులు తప్పుపట్టినా, ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు సరికదా, సుప్రీం కోర్టులో తనదే గెలుపనే ధీమాతో ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఓడిపోతే ప్రపంచ దేశాలముందు తన పరువేం గాను అనే స్పృహ ఆయనకు కలగకపోవడమే విచిత్రం. సుంకాల బూచిని చూపి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలువరించినట్లే బియ్యం ఎగుమతుల విషయంలోనూ భారత్ కు ముకుతాడు వేయొచ్చన్నది ట్రంప్ ఎత్తుగడ. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం భారత్‌లో అమెరికా బృందం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో బియ్యంపై సుంకాల విషయంలో ట్రంప్ తాటాకు చప్పుళ్లకు భారత్ బెదరదనే విషయాన్ని విస్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది.