పదేళ్ల క్రితం దాకా తెలుగువాళ్లంతా ఒకే రాష్ట్రంగా ఉన్నారు. ఆంధ్ర ఆధిపత్యం, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యం ఇలా వివిధ కారణాల వల్ల స్వీయపాలన కోసం తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది. కళలలో కూడా ఆంధ్రుల ఆధిపత్యమే సాగడంవల్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళారూపాలు ధ్వంసమైన మాట కూడా నిజమే. అయినా ఆంధ్రప్రాంత కళలకు, కళాకారులకు, రచయితలకు ఈ వైపు నుంచి గౌరవాభిమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి ఆధిపత్యాన్ని అంగీకారం లభిస్తోంది. తెలుగు వారందరి లాగే తెలంగాణవాసులు కూడా ఆంధ్ర ఆధిపత్య సినిమాలను ఆదరిస్తున్నారు. దీనిని కేవలం వినోదంలో భాగంగా, అభిరుచిగానే చూడాలి. భవిష్యత్తులో తెలంగాణ భాష, కళలు విడిగా స్థిరపడే కార్యక్రమాలు అటు ప్రజల నుంచి మొదలై ప్రభుత్వ తోడ్పాటుతో ముందుకు సాగాలి. అలా కాలం గడిచిన కొద్దీ కొత్తగా పాదుకునే కళా వైవిధ్యాల పరిణామక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎవరి సాంసృతిక చిహ్నాలు వారికి ఏర్పడవచ్చు. రాబోయే రచయితలు, కళాకారులు కూడా తాము ఉమ్మడి రాష్ట్ర వారసులుగా భావించే అవకాశం లేదు. అంతదాకా ఉమ్మడి రాష్ట్ర కాలంలోని రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, సినిమా నటులు ఇరువైపులా అభిమానం పొందుతారు.
వివిధ రంగాల్లో ఉండి తెలంగాణను కావాలని తక్కువ చేసిన ఆంధ్రులకు మాత్రం ఎప్పటికి గౌరవం దొరకదు. రాష్ట్రం వేరుపడినా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహానుభావుల విషయంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వ్యతిరేక, శత్రుభావన లేవు. ట్యాంక్ బ్యాండ్ పైని విగ్రహాల ధ్వంసం కూడా ఓ అక్రోశంలోంచి పుట్టిన కోప ఫలితమే తప్ప అదో ప్రణాళికాబద్ధ ప్రతిచర్య కాదు. దానికి ఆనాటి పాలకులే బాధ్యత వహించాలి. మరింత కాలం ప్రజల అభిమానాలను గౌరవిస్తూ ఉమ్మడి కాలంలో అలరించిన కళాకారులను ఇరువైపులా ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినవారు, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటించినవారు ఎప్పటికైనా తెలంగాణ శత్రువులే. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు ఆంధ్రావారైనా, తెలంగాణవారైనా ఒకటే. తెలంగాణ సాధనను వ్యతిరేకించని వారితో పేచీ అక్కర లేదు. అయితే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాథమ్యాలను పక్కనపెట్టి రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒకటే అన్న రీతిలో చాప కింద నీరులా తమ ఆలోచనని విస్తరిస్తోంది. ఆంధ్రుల చేతిలో తెలంగాణ ప్రజలు పడిన అవమానాలు, వివక్షలు అన్నీ ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి ఆకాంక్షలు తీరని లేదు. అయితే కొత్త ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని కావాలని తొక్కివేసే కార్యక్రమాలు చేపడుతోంది.
కొన్ని సంఘటనలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఆంధ్ర రాష్ట్ర సారథి చేతిలో ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. తెలంగాణ రాజధానిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపన ఆలోచన ఇందుకు మరో ఉదాహరణ. రవీంద్రభారతి ప్రాంగణంలో డిసెంబర్ 15న ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విగ్రహం రవీంద్రభారతి ప్రాంగణంలోకి చేరింది. ముసుగు తొలగించే కార్యక్రమమే మిగిలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ గాయకుడి బావమరిది, నటుడు సుధాకర్, కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పర్యాటక్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్ల్లి కృష్ణారావు కూడా స్థలాన్ని సందర్శించి ఇది ప్రభుత్వ నిర్ణయమని ప్రకటించారు.
బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపనపై తెలంగాణవాదుల నుండి గట్టి వ్యతిరేకత కనబడుతోంది. తెలంగాణలోని సినీ అభిమానులు మాత్రం కళలకు ప్రాంతీయత లేదని వ్యతిరేకతను తప్పుపడుతున్నారు. ఈ రకంగా విగ్రహ ఏర్పాటుపై రెండు రకాల అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే ఉద్యమ కాలంలో నిర్మించిన ఓ తెలంగాణ సినిమాలో తెలంగాణ అనే పదంతో కూడిన పంక్తి ఉన్నందున ఆ పాట పాడడానికి ఆ గాయకుడు నిరాకరించాడని ఓ వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే బాల సుబ్రహ్మణ్యం తెలంగాణను వ్యతిరేకించినట్లే. ఆయన అభిమానులైనా ఈ విషయాన్నీ తీవ్రంగా తీసుకోవాలి. మరోవైపు వద్దు వద్దన్నా మొండిగా ఏర్పాటుకు సిద్ధపడడం ఆక్షేపణీయమే. నిలదీస్తున్న తెలంగాణవాదులకు సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా కమిటీ సభ్యులు జారుకుంటున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందని ప్రజల అభీష్టాన్ని ఇలా పక్కన పెట్టడం పద్ధతి కాదు.
బలవంతంగా విగ్రహం పెట్టి సాధించేదేమిటి? హైదరాబాద్‌పై తమ పెత్తనం తగ్గలేదని రుజువు చేసుకునే ఆంధ్రుల పన్నాగమేనా ఇది అని అనుకోవలసి వస్తుంది. మరోవైపు చూస్తే ప్రపంచ స్థాయి కంపెనీల రాకతో తెలంగాణ రూపురేఖల్లో మార్పు వస్తోంది. దాని ప్రభావం తప్పకుండా ప్రాంత అస్తిత్వంపై పడుతుంది. ఇతర రాష్ట్రాల, విదేశీయుల ఆస్తులు ఇక్కడ పెరిగిపోతున్నాయి. వారితో స్థానికులు పోటీ పడలేని స్థితి వస్తుంది. మంచికో చెడుకో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అది కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదు అనే రోజులు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇది ఉండాలి, అది ఉండొద్దు అనేందుకు గొంతు సరిపోని కాలం వచ్చింది. పాలకులు ఆ వైపు ఉంటే ఇంకేమి చేయలేని స్థితి ఇది. తరం మారుతున్నది కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచన సరళి కూడా మారిపోతోంది. జరిగేది జరగని అనే నిర్లిప్తతలో వారు పడిపోయినట్లున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హమారా హై అనే గొంతులకు బలం చేకూర్చవలసిన అవసరం ఎంతో ఉంది.