మనతెలంగాణ/హైదరాబాద్:గూగుల్ సంస్థ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్‌లు కష్టపడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేయనున్న ట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే కాకుండా యూనికార్న్‌పై దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కనీసం హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాల ని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకో సిస్టమ్ ను సృష్టించాలనుకుంటున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో గూగు ల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రాన్ని సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభోత్స వానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఎం రే వంత్ రెడ్డి మాట్లాడుతూ 1998లో గూగుల్ ప్రస్థా నం ఒక స్టార్టప్‌గానే మొదలైందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ విజయ ప్రస్థానం తమకు ని త్యం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. గూగుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నామని సిఎం తెలిపారు. గూగుల్, యాపిల్, అమెజాన్, టెస్లా వంటివి గొప్ప స్టార్టప్‌లని ఆయన కొనియాడారు. 100 స్టార్టప్‌లను 1 బిలియన్ జాబితాలో చేర్చేలా కృషి చేస్తామన్నారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించిన చాలా స్టార్ట్-ప్‌లు ప్రస్తుతం పెద్ద కంపెనీలుగా ఎదిగాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని
ఈ సందర్భంగా యువతకు స్ఫూర్తి కలిగించే విషయాన్ని సిఎం చెబుతూ యువకులు, శక్తివంతులు సాధారణంగా వారి కలలను సాకారం చేసుకోవాలనుకుంటారన్నారు. అందులో భాగంగా ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారని, అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని ఆయన తెలిపారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని రెండు రోజులు గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని ఆయన తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే స్టార్టప్‌ను ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతానని, తాను కూడా ఫుట్‌బాల్ ఆడతానని, ఈ ఆటలోనూ సమష్టి కృషి అవసరమని, పట్టుదలతో సాధన చేయాలని, ఇది టీమ్ వర్క్, కానీ, చివరకు గెలుపు చాలా ముఖ్యమని, స్టార్టప్‌లు కూడా అదే విధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతాం: మంత్రి శ్రీధర్‌బాబు
తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇదో కొత్త ప్రారంభమని, ఇదో కొత్త ప్రయాణమని ఆయన కొనియాడారు. స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తమ స్టార్టప్‌లకు గూగుల్ మెంటార్‌గా ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఇక ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని ఆయన సంతోషించారు. యూనికార్న్‌ను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయని, ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతామని ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని మొదటి ప్రైవేటు రాకెట్ హైదరాబాద్‌లోనే తయారైందన్న విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. టీహబ్‌కు గూగుల్‌ను రప్పించేందుకు చాలా శ్రమించామని, కానీ, ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే ఐదో గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన తెలిపారు.
గూగుల్ ఫర్ స్టార్టప్స్ చేసే పని
ఇన్వెస్టర్లు, పార్ట్‌నర్లు, ప్రభుత్వానికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ వారథిగా నిలవనుంది. ప్రపంచస్థాయి ఆవిష్కరణలను గూగుల్ ఫర్ స్టార్టప్ ప్రోత్సహించనుంది. ప్రాంతీయ అంకుర పరిశ్రమలను ప్రపంచ స్థాయికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ పరిచయం చేయనుంది. ఏడాది పాటు టీహబ్‌లో అంకుర పరిశ్రమలకు ఉచితంగా సీటింగ్ కల్పించనుంది. స్టార్టప్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు, నైపుణ్యం గూగుల్ ఫర్ స్టార్టప్స్ పెంపొందించనున్నాయి.