గన్‌మెన్లు లేకుండా, పోలీసు పహారా లేకుండా ఒయుకు వస్తాను అని చెప్పి సిఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని బిఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. విద్యార్థులను అరెస్టు చేసి పొలీసు పహారా మధ్య సిఎం ఆర్ట్ కళాశాలకు వచ్చారని పేర్కొన్నారు. మాట మీద నిలబడటం సిఎంకు చేత కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె నిండా అభిమానం నింపుకుని సిఎం ఒయుకు రాలేదు అని, గుండెల నిండా భయంతో కెసిఆర్ మీద విషం నింపుకుని వచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ, విద్యార్థులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఒయులో సిఎం ఇంత స్వేచ్ఛగా మాట్లాడే వారు కాదని అన్నారు. సిఎం భజన బృందంలో కోదండరాంతో పాటు మరికొంత మంది చేరారని ఎద్దేవా చేశారు. స్వ డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా తప్ప సిఎం మీటింగ్‌లో ఏమీ లేదని విమర్శించారు. చదువుల తల్లిని కూడా సిఎం ప్రేమిస్తున్నారు అంటూ ప్రొఫెసర్లు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియాకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి దేనికోసమో సిఎం చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
గురుకులాలల్లో విద్యా వ్యవస్థను సిఎం భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒయు హాస్టళ్లలో కూడా పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాలు చేశారని అన్నారు. దావోస్‌లో అబద్దాలే గ్లోబల్ సమిట్‌లో అబద్దాలే అని పేర్కొన్నారు.2 వేల స్కూళ్ళు ఎందుకు మూత పడ్డాయో రేవంత్ రెడ్డి చెప్పాలిలని డిమాండ్ చేశారు. 25 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సగం చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టడం చేతకాని సిఎం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డి తీరు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి మూడు రంగుల జెండా పట్టి అనే రేవంత్‌రెడ్డి పాటను ఎందుకు వినిపించారని ప్రశ్నించారు. అశోక్ నగర్‌లో ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన విద్యార్థులపై లాఠీలు జులిపించిన ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. ఒయులో కూడా కెసిఆర్, కెటిఆర్,హరీష్ రావులను తిట్టడమే సిఎం పనా..? అని ప్రశ్నించారు.