గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించడంతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు (బావ-బావమరిది) జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవతో గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే దీనిని కెటిఆర్, హరీష్ రావు జీర్ణించుకోలేక సమ్మిట్ ముగిసిన సాయంత్రం నుంచే ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని ఆయన విమర్శించారు. వారు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి, మిషన్ కాకతీయ ఇవన్నీ విజన్ పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతి ఎంవోయు, ప్రతి పెట్టుబడి, ప్రతి వివరాన్ని పారదర్శకంగా పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని, ఇదే తమ జవాబుదారీతనమని ఆయన తెలిపారు.