ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా లోక్‌సభలో మాట్లాడారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ మాట్లాడిన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన లేదనేది మరోసారి నిరూపితమైందని ఆయన బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సంస్కరించేందుకు ‘సల్’ అవసరమనే విషయం రాహుల్ గాంధీ ముందుకు తెలుసుకోవాలని ఆయన సూచించారు. బిహార్ ఎన్నికల్లో ‘సర్’ వల్ల బిజెపి కానీ, ఎన్డీయే లబ్ది పొందలేదని ఎన్నికల విశ్లేషకులు బల్ల గుద్ది చెప్పారని, అయినా రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఒకవైపు ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తూ, తప్పులను సరిదిద్దేందుకు ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తే దానినీ విమర్శించడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి, వితండవాదానికి, అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నిక జరిగిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత సిసి టివీ ఫుటేజిని ధ్వంసం చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించడం రాహుల్ అమాయకత్వానికి అద్దం పడుతున్నదని ఆయన తెలిపారు. ఎన్నిక జరిగిన తర్వాత ఏవైనా వివాదాలు, ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇచ్చిన గడువు నలభై ఐదు రోజులని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ కొత్తగా మళ్లీ ఇవిఎంల పాట అందుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.