నగరంలోని చాంద్రాయణగుట్టలో చోటు చేసుకున్న మత్తు ఇంజక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనం రేపింది. మత్తుకోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో విచారణ చేపట్టిన చాంద్రాయణ గుట్ట పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. అధిక డోసు వల్లే వారు మృతిచెందిన ట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆటోలనే కుప్పకూలి మరణించడంతో ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విశ్లేషించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై పలు ఆధారాలు సేకరించారు. రోగులకు చికిత్స చేసేందుకు వాడాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జైపాల్ రెడ్డి బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్ముతున్నాడు.
అతడి వద్ద నుం చి ఈ ప్రమాదకర ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారం లో మరో ఆసుపత్రికి చెందిన ఇంకో వైద్యుడి పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇరువురూ కలిసి అక్రమంగా అనస్తీషియా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఆసుపత్రుల్లో నిల్వ ఉన్న ఔషధాలను దారిమళ్లించి మత్తుకు అలవాటుపడిన వారికి అమ్ముతూ వ్యాపారం సాగిస్తున్నారని వెల్లడించారు. అనుభవజ్ఞు లైన వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ఇంజెక్షన్లను ఇలా బహిరంగంగా అమ్మడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.