మహారాష్ట్రలో బుధవారం 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. మావోయిస్టులుగా చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన వారిపై మొత్తం కలిపి రూ 82 లక్షల రివార్డు ప్రకటితం అయి ఉంది. రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలో వారు డిజిపి ఎదుట సరెండర్ అయ్యారని అధికారులు తెలిపారు. నలుగురు తమ యూనిఫాంలలో వచ్చి ఇతరులతో పాటు ఆయుధాలతో సరెండర్ అయినట్లు తెలిపారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లిందని, శుష్క సిద్ధాంతాలతో విసిగి తాము సరెండర్ అయినట్లు వీరు తెలిపారని పోలీసు వర్గాలు తమ ప్రకటనలో వెల్లడించాయి. విచక్షణారహిత హింసాకాండ, పౌరుల వధ వంటివాటితో వీరు విసిగిపోయారని జనజీవన స్రవంతిని ఎంచుకున్నారని తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యులు రమేష్ లేకామి , భీమ్ కోవాసి, ఇతర కేడర్ల వారు పోరియో గొట, రతన్ ఒయం ఉన్నారు.