ప్రధాని మోడీ ఇవిఎంలను హ్యాక్ చేయలేదని, ఆయన ప్రజల హృదయాలను హ్యాక్ చేశాడని బిజెపి ఎంపి , నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో ఆమె మాట్లాడారు. విశేష రీతిలో ప్రజాభిమానం కొల్లగొట్టుకుని , వారి మన్నన్నలు పొందిన మోడీకి ఇవిఎల హ్యాకింగ్ అవసరం ఉండదని ఆమె స్పందించారు. నేరుగా మనస్సుల్లో తిష్టవేసుకున్న వ్యక్తికి ఓట్లను కాజేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని చట్టసభలను అడ్డుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాయని, గడిచిపోతున్న ఏడాది అంతా ఈ విధంగా ముగియడం దారుణం అన్నారు. వారి గెంతులు , వెల్‌లోకి దూకడాలు, నినాదాలకు దిగడాలు ఇవన్నీ బాధాకరం అన్నారు. ప్రతిపక్షాలు రోజూ సభలకు ఆటంకాలు కల్పించడమే తమ రివాజుగా పెట్టుకున్నారని విమర్శించారు. వారి ధోరణితో సభలు సజావుగా సాగని పరిస్థితి ఉందన్నారు. ప్రతి సెషన్‌లోనూ వారు సభలను తమ ఆటలకు థియేటర్లుగా మల్చుకుంటున్నారని హీరోయిన్ అయిన రనౌత్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏడాదిగా ఈ విషయంలో చెప్పిందే చెపుతున్నాడని స్పందించారు. ఆయన కొత్తగా ఏదో చెపుతాడనుకుంటే , అరిగిపోయిన రికార్డును విన్పిస్తున్నారని స్పందించారు.