లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం పార్లమెంటు శీతాకాలం సమావేశాలు జరుగుతుండగానే జర్మనీలో పర్యనటకు వెళ్లనున్నారు. డిసెంబర్ 15-20 తేదీల మధ్య బెర్లిన్ లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశాలకు రాహుల్ హాజరవుతున్నారు.పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19 వరకూ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఆయనను లీడర్ ఆఫ్ పర్యటన్ అని అభివర్ణించింది. రాహుల్ తరచు విదేశాలలో పర్యటిస్తూ, తన విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎద్దేవా చేసింది. కాగా, ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలను ఉటంకిస్తూ, కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. ప్రియాంక గాంధీ వద్రా బీజేపీ దాడులను దీటుగా తిప్పికొడుతూ, మోదీజీ తన పనిదినాల్లో సగం విదేశాలలోనే గడుపుతారు. ప్రతిపక్ష నాయకుడి ప్రయాణంపై కాషాయదళం ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రియాంక విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ ఎల్ ఓపి అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ , లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అని రాహుల్ గాంధీ నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ సీరియస్ కాని రాజకీయ నాయకుడని, ప్రజల మూడ్ లో ఉంటే ఆయన శాశ్వత సెలవుల మూడ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో గడుపుతారని, ఆ తర్వాత తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శిస్తారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.కాగా, లోక్ సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ , ప్రధాని వద్ద సమాధానాలు లేవన్నారు. రాహుల్ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేక, ఇప్పుడు ఆయనపై బురదజల్లే కార్యక్రమానికి తెగపడిందని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.