పరీక్షల నిర్వహణకు నెలరోజుల సమయం సరికాదు : ఎఐఎస్‌ఎఫ్
మన తెలంగాణ / హైదరాబాద్ : పదో తరగతి వార్శిక పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలని ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని, ఏడు పేపర్ల పరీక్షల నిర్వహణను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని కోరారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉంటే సరిపోతుందన్నారు. పరీక్షలకు నెల రోజుల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని, నెల రోజులపాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నపత్రాల భద్రత, మూల్యాంకన ప్రక్రియ పై కూడా ప్రభావం పడుతుందని వారన్నారు. ప్రభుత్వం వెంటనే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ని సవరించి మరొక షెడ్యూల్ విడుదల చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.