మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియో చూసి మహిళకు ఆపరేషన్ చేశాడు. అది వికటించడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా గతకొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో ఈ నెల 5న కోథి ప్రాంతంలోని దామోదర్ ఔషధాలయానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ క్లినిక్ నిర్వహిస్తున్న వ్యక్తి జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆ మహిళను పరిశీలించి కడుపులో రాళ్లు ఉన్నాయని దాంతో ఆమె నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ కు రూ.25,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో భార్యకు సర్జరీ కోసం రావత్ రూ.20,000 చెల్లించాడు. మునిశ్రాకు ఆపరేషన్ చేయగా ఆ మరునాడు ఆమె మరణించింది. మరోవైపు ఆ మహిళ భర్త రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత సర్జరీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బంధువైన వ్యక్తితో కలిసి తన భార్యకు ఆపరేషన్ చేసినట్లు చెప్పాడు. పొట్టలో లోతుగా కోయడంతో పలు రక్త నాళాలు తెగి ఆమె మరణించినట్లు ఆరోపించాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు క్లినిక్ లో తనిఖీ చేశారు. క్లినిక్ ను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని క్లినిక్ ను సీల్ వేశారు.