స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు(135, 102), ఒక అర్థ శతకం (65 నాటౌట్) సాధించి.. భారత్ ఈ సిరీస్‌ని 2-1 తేడాతో విజయం సాధించేందుకు మార్గం సుగమం చేశాడు. అంతేకాక మొత్తం 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో తన ర్యాంకును మెరుగుపరచకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌లను వెనక్కి నెట్టి.. రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
అంతేకాక.. మొదటి ర్యాంకుకు అత్యంత చేరువలోకి వచ్చాడు కోహ్లీ. తాజాగా ప్రకటించిన ర్యాంకులలో 773 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 781 పాయింట్లతో రోహిత్ శర్మ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరచుకొని మూడో స్థానంలో స్థిరపడ్డాడు. మొదటి స్థానంలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్, రెండో ప్లేస్‌లో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ తొమ్మిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.