అమరావతి: మరోసారి మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఒడిల సమావేశంలో మంత్రుల పని తీరుపై ప్రస్థావన తీసుకొచ్చారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని, చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడంలేదని చురకలంటించారు. కేంద్ర నిధులు తీసుకరావడంతో పాటు వినియోగంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని, ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర పథకాలను ఏపీకి ఎక్కువగా తీసుకురావాని, అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. వైసిపి విధానాలతో జనం ఇబ్బందుల పాలయ్యారని గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఆంధ్ర అడుగులేస్తోందని, అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.
విశాఖలో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చని తెలియజేశారు. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు, బిజినెస్ రూల్స్ మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూల్స్ ఉండాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు రావాలి? నిలదీశారు. వివిధ కార్పొరేషన్లను కూడా రీ స్ట్రక్చర్ చేయాలని, ఫైల్స్ క్లియరెన్స్ వేగవంతంతో పాటు అనవసర ఫైళ్లు సృష్టించే విధానం పోవాలన్నారు. దేశంలో ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే అని చంద్రబాబు తెలిపారు. ప్రతి శాఖ చేసిన పనులన్నీ తన వద్ద రికార్డు రూపంలో ఉన్నాయని, పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ఇప్పుడు భూగర్భజలాలు పైకి వచ్చాయని, భూగర్భజలాలు 3 మీటర్లకు చేరితే ఖర్చుపెట్టే బడ్జెట్ తగ్గుతుందని తెలియజేశారు. సౌరశక్తి వినియోగించుకుంటే విద్యుత్ డిమాండ్ బాగా తగ్గుతుందని, ఈ ఏడాది కరెంట్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పారు.