టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో బుమ్రా రెండు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుని బుమ్రా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ గా.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదవ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 101 వికెట్లు సాధించాడు బుమ్రా.
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా కంటే ముందు.. న్యూజిలాండ్ ఐకాన్ టిమ్ సౌథి ఉన్నారు. సౌథి107 టెస్టుల్లో 391, 161 వన్డేల్లో 221, 126 టీ20ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. అయితే, డిసెంబర్ 2024లో టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు.. కానీ వైట్-బాల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడు ఫార్మాట్లలో సెంచరీ వికెట్లు తీసిన మరో బౌలర్. మలింగ 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 228 వికెట్లు, 338 వికెట్లు, 84 టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. మలింగ 2021 సెప్టెంబర్‌లో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు.
అలాగే, పాకిస్తాన్ స్టార్ షాహీన్ షా అఫ్రిది కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో షహీన్ 100 టీ20 వికెట్లు పూర్తి చేసి మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించాడు. షహీన్ 33 టెస్టుల్లో 121 వికెట్లు, 71 వన్డేల్లో 135 వికెట్లు, 96 టీ20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.ఇక, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు. షకీబ్ 2021లో తన 100వ టీ20 వికెట్‌ను సాధించాడు. షకీబ్ 71 టెస్టుల్లో 246 వికెట్లు, 247 వన్డేల్లో 317 వికెట్లు, 129 టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు.