తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఇందిర మహిళా స్టాల్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం మహిళలను ఆత్మవిశ్వాసంతో నిలబడే యజమానిగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మహిళా సాధికారతను ప్రతిబింబించే ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం ఎదుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళ శక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని పని చేస్తోందని అన్నారు. ఈ స్టాల్‌లో కనిపిస్తున్న ప్రతీ విజయకథ తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
సెర్ప్, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా రూపొందించిన ఈ స్టాల్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఆధ్వర్యంలో మహిళల చేతుల్లో నడుస్తున్న విభిన్న వ్యాపారాలు, సేవలు, ఆర్థిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మహిళల నిర్వహణలో ఉన్న పెట్రోలు బంకులు, హైటెక్ సిటీలో పనిచేస్తున్న మహిళా శక్తి బజార్, జిల్లాల వ్యాప్తంగా నిర్మితమైన మహిళా శక్తి భవనాలు, శక్తి క్యాంటిన్లు, అలాగే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణలో మహిళలు సాధిస్తున్న విజయాలు దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ మహిళా సంఘాలు పెద్ద స్థాయిలో వ్యాపారాలు నడపడం, కార్పొరేట్ స్థాయి సేవలు అందించడం, ఇదే కొత్త తెలంగాణ శక్తి అని అన్నారు. మహిళకు వేదిక ఇస్తే ఆమె అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుందనే దానికి ఈ ప్రదర్శనే సాక్షమని అన్నారు.