రాజ్‌నంద్‌గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్‌ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్‌లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే.
“ఛత్తీస్‌గఢ్‌లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్‌మద్‌లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్‌లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు” అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు