భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, అక్కినేని నాగార్జున, పలువురు మంత్రులు, దేశవిదేశీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..”కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది” అని చెప్పారు