ఆరు గ్యారంటీలు గల్లంతు
అమలయ్యింది ఉచిత బస్సు, సన్నబియ్యం మాత్రమే
దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి
అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూదొందే
బిజెపి మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
రైజింగ్ కాదు.. సింకింగ్ తెలంగాణ:ఎంపి లక్ష్మణ్
కాంగ్రెస్ సైతం భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు
ధారాదత్తం చేస్తోంది: రాంచందర్ రావు
మన తెలంగాణ/విద్యానగర్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మాయ చేశారని బిజెపి నేతలు మండిపడుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీ జేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు డా క్టర్ కె.లక్ష్మణ్, డి.కె.అరుణ, మాజీ ఎంపీ సుధాక ర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనా తప్పిదాలు, హామీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వంపై చార్జీ షీట్ విడుదల చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని, ప్రజలను మోసం చేసే పార్టీలు అని ఆరోపించారు. నిజంగా చెప్పింది చేశామన్న నమ్మకం, దైర్యం ఉంటే హామీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందనీ, తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలనను రుద్దిందనీ చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయనీ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం కేసీఆర్ నియంత పాలనతో ఆయన కుటుంబం చేతిలో బందీగా మారిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు మార్పుకోసం, అనేక రకాల హామీలు, అభయహస్తాలను నమ్మి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించారని పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మళ్ళీ మోసం చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు చేయడాన్ని తప్పుపట్టిన కిషన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళుతున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం తప్ప మరేం చేశారో చెప్పాలన్నారు. రేవంత్ సర్కారు ఇస్తున్నామంటున్న ప్రతి కిలో సన్నబియ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాటా 43 రూపాయలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 రూపాయలు మాత్రమే ఇస్తున్నదనీ తెలిపారు. మీ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి, ఏ రంగంలో మీరు చెప్పిన మార్పు వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డినీ ప్రశ్నించారు. కేసీఆర్ పోయి రేవంత్, గులాబీ జెండా పోయి, కాంగ్రెస్ జెండా వచ్చిందనీ, పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లోను మార్పు లేదని, వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనీ, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లో చేరారనీ, తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారనీ వాపోయారు.
రైతులు, నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేంద్రమంత్రి ఇచ్చిన హామీలపై ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తారా లేదంటే ప్రజాభవన్, ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందన్నారు. భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందనీ ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరమే ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తోందనీ మండి పడ్డారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. విద్యార్థుల ఫీజులు,ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోగా, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదనీ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఏమైందనీ, పదిహేను వేల రైతు భరోసాను ఎప్పుడూ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ డి. కె అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమని చెప్పారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉండగా తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందన్న సందే హాన్నీ వెలిబుచ్చారు.