ప్రధాని మోడీతో ప్రారంభం… కీలక అంశాల ప్రస్తావన
న్యూఢిల్లీ ః జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్‌సభలో సోమవారం చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. చర్చ ఆరంభ ప్రసంగంలో ప్రధాని మోడీ వందేమాతరంపై అనేక కీలక ఆసక్తికర విషయాలను, చరిత్రలో వెలుగుచూడని కోణాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. గత వారం బిఎసి సమావేశంలో వందేమాతరంపై ఉభయ సభలలో వేర్వేరుగా పది గంటల పాటు చర్చను అజెండాలో ఖరారు చేశారు. ప్రధాని మోడీ తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికార పక్షం తరుఫున రెండో వక్తగా ప్రసంగిస్తారు. కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో పార్టీ ఉప నాయకులు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ ఇతరులు మాట్లాడుతారు.
మంగళవారం జరిగే చర్చలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. లోక్‌సభలో పది గంటల పాటు వందేమాతరంపై చర్చా కార్యక్రమాన్ని అధికార వర్గాలు నిర్థారించాయి. వందేమాతరంతో ముడివడి ఉన్న పలు కీలక అంశాలు ఈ చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయని ప్రకటనలో తెలిపారు. బెంగాలీ కవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన గీతం ఆ తరువాత జాదూనాథ్ భట్టాచార్య సంగీత బాణిలో రూపుదిద్దుకుని , దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్ఫూర్తిని అందించే జాతీయ గీతంగా జనం మన్నన్నలు పొందింంది. ఈ గీతానికి 150 సంవత్సరాల వసంతం ఏడాది దశలో ఈ ఏడాది మొత్తం ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాతీయ గీతంలోని కొన్ని ప్రధాన చరణాలను కాంగ్రెస్ పార్టీ 1937లో తొలిగించిందని, ఇది దేశ విభజనకు ఆద్యం పలికినట్లు అయిందని ఆరోపించారు. ఇక రాజ్యసభలో మరుసటి రోజు మంగళవారం వందేమాతరంపై పది గంటల చర్చను హోం మంత్రి అమిత్ షా ఆరంభిస్తారు.
రాజ్యసభలో అధికార పక్షం నేత, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా రెండో వక్తగా ఉంటారు. ఎగువ సభలో ప్రతిపక్షాల తరుఫన చర్చను కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరంభిస్తారు. సమావేశాల ఆరంభం నుంచి అత్యధిక సమయం సర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతిపక్షాల నిరసన హోరుతో ప్రతిష్టంభనల నడుమనే సాగుతూ వచ్చాయి. ఈ దశలో ఇప్పుడు సర్‌పై చర్చకు అంగీకారం కుదిరింది. మూడు రోజుల పాటు జరిగే వందేమాతరం చర్చలో కాంగ్రెస్ పార్టీ వక్తల జాబితా ఖరారు అయింది. దీపేందర్ హూడా, బిమోల్ అకోయిజమ్, ప్రణతి షిండే, ప్రశాంత్ పదోలే, చామల కిరణ్ రెడ్డి , జ్యోత్సా మహంత్ మాట్లాడుతారు. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ తరఫున కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మెహ్మద్ జావెద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇసా ఖాన్, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, జ్యోతిమణి పేర్లు ఖరారయ్యాయి.