మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి. హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయని, ఇది శాసనసభ రాజ్యాంగబద్ధమైన విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై హరీష్ రావు తన లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం అని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు.
గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లుగా సభా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ వంటివి పనిచేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ పనిదినాలు గణనీయంగా తగ్గిపోయాయని, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, అన్‌స్టార్డ్ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హరీష్ రావు పలు డిమాండ్లు చేశారు.
ఏడాదికి కనీసం 30 రోజులు సభను నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈ లేఖ ప్రతిని శాసనసభా వ్యవహారాల మంత్రికి కూడా పంపించారు.