అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం
రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది
విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి భారత్ ఫ్యూచర్‌సిటీని సందర్శించినప్పుడు మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాలనపై స్పందించారు.
అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతిరథం పరుగులు
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని, రెండేళ్ల కాలం తక్కువే కానీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడలేని, ఎవరూ ఊహించని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోందన్నారు.
నాలుగు గ్యారంటీలను అమలు చేశాం
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ అగ్రస్ధానంలో నిలిచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.
ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పొంగులేటి తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటి జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రిఫరెండమ్ అని బిఆర్‌ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే తమ ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో అందరికీ అర్థం అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాల్లో విప్లవాత్మక మార్పుల తీసుకు వచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంత వరకు తగ్గించడం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.