భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం గురించి గత కొంతకాలం జరుగుతున్న చర్చకి ఎట్టకేలకు స్మృతి చెక్ పెట్టింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో నవంబర్ 23న స్మృతి వివాహం జరగాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి ఇన్‌స్టా స్టోరీ ద్వారా స్పష్టం చేసింది.
‘‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టు ఎన్నో ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు నేను మాట్లాడటం ఎంతో ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ, వివాహం రద్దయిందని స్ఫష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. రెండో కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని కోరుతున్నా. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్ధతిచ్చిన అందరికి ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని స్మృతి తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.
పలాశ్ కూడా పెళ్లి రద్దవుతున్నట్లు ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు. తన జీవితంలో మూవ్ ఆన్ అవుతున్నానని.. ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తన లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని.. ఇలాంటి కష్ట సమయంలో తన పక్షాన ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపాడు.