మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. తొలుత హెలీకాఫ్టర్ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంత రం ప్రాంగణానికి చేరుకున్న సిఎం ప్రతి హాల్‌ను సందర్శించారు. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం, ఇతర కార్యక్రమాలకు సం బంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్‌ను ఆయన వీక్షించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, సదుపాయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రా కపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా ఆయన కలియతిరిగారు. సిఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.