మన తెలంగాణ/హైదరాబాద్ : మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో తెస్తున్న సంస్కరణలు స్థానిక పరిస్థితులను విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని విమర్శించారు. అమెరికా, ఐరోపా దేశాల కోసం రూపొందించిన చట్టాలను, విధానాలను గుడ్డిగా ఇక్కడ అమలు చేయడం సరికాదని, మన దేశంలోని భిన్నమైన సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉండటమే ఇక్కడి పేదరికానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం కొత్త లేబర్ కోడ్‌లపై కార్మిక సంఘాల రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి వినోద్‌కుమార్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ ముఖ్యనేతలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేండ్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు.
ఢిల్లీలో సోనియా గాంధీ వ్యతిరేకించిన బిల్లును తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని కెటిఆర్ ప్రశ్నించారు. కొత్త లేబర్ కోడ్‌లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతో పాటు, అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను స్తంభింపజేస్తామని తెలిపారు. వరంగల్‌లో తదుపరి సమావేశం నిర్వహిస్తామని కార్యాచరణను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున, రాజకీయాలకు అతీతంగా ఏ కార్మిక సంఘంతోనైనా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ ఏకాధిపత్యం(మోనోపోలీ) ప్రమాదకరమని కెటిఆర్ హెచ్చరించారు. ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని, విమానాశ్రయాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లను తలపించాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం.. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదని పేర్కొన్నారు.
అంబేద్కర్‌కు ఘన నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బా బాసాహెబ్ చొరవతో ఏర్పాటు చేసిన ఆర్టికల్ 3 దోహదపడిందన్నారు.