కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం శుక్రవారం పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి అంటూ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పకునేది లేక గప్పాలు కొట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ అంటూ, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి, ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంప దృష్టి సారించాలని సూచించారు. గత సీజన్ యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి సిఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది..? అని ప్రశ్నించారు.