పేదల పక్షపాతి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సాంబశివరావు, కవిత, గుమ్మడి నర్సయ్య, పరమేశ్వర్ హివ్రాలే, ఎన్.సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు. హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ”మా నాన్న గారు కూడా గుమ్మడి నర్సయ్య లాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలి’అని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతా”అని తెలిపారు. గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది అని తెలియజేశారు.