న్యూఢిల్లీ : సామాన్యులకు న్యాయం కల్పించడం కోసమే సుప్రీం కోర్టు అన్న బలమైన సందేశాన్ని పంపాలనుకుంటున్నామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ధిష్ట సమయంలో త్వరగా పరిష్కరించడమే తన ప్రాధాన్యంగా ఆయన వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సామాన్యులకు న్యాయం అందుబాటులోకి రావలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. న్యాయపరమైన ఖర్చులు ఎలా తగ్గించాలి ? వ్యాజ్యాల పరిష్కారానికి సహేతుకమైన కాలపరిమితిని ఎలా నిర్ణయించాలి? అన్నవే తన ప్రాధాన్యంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి అడగ్గా, రాజ్యాంగంలో అధికార విభజన ఎలా జరిగిందో ప్రస్తావించారు.
ప్రభుత్వశాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పాత్రలను రాజ్యాంగం చక్కగా నిర్వచించిందని వివరించారు. ఒకదానిపై మరొకటి అతిక్రమించే అతివ్యాప్తి లేదన్నారు. కొన్ని వ్యాజ్యాల ప్రాధాన్యతతో సహా రానున్న రోజుల్లో సుప్రీం కోర్టులో కొన్ని సంస్కరణలు రావలసి ఉందన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్ వంటి కేసులను ఉదహరిస్తూ న్యాయవ్యవస్థ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని , అందువల్ల న్యాయవ్యవస్థ అప్‌డేట్ కావలసి ఉందన్నారు. నాణ్యమైన న్యాయసహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించవలసి ఉందని, ఈమేరకు ఎవరికైతే సహాయం అవసరమో వారికి న్యాయం అందించడానికి సమర్థులైన న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు.