అమరావతి: విశాఖపట్నంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే జరుగుతోంది. విరాట్ కోహ్లీ రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోయాయి. తొలి వన్డేలో టీమిండియా గెలవగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచి సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. బ్లాక్ లో మ్యాచ్ టికెట్ల విక్రయాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రూ.3 వేల టికెట్ ను రూ.8 వేలకు అమ్ముకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.