బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో పెట్టిన ఓ అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోన్న వేళ.. బుక్ మై షో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు యాప్‌లో అప్‌డేట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే యాప్‌లో అలా అప్‌డేట్ చేసి ఉంటారా.. అంటే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందా? అని అభిమానులు అనుకుంటున్నారు. గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ఈసారి కూడా ‘అఖండ-2’తో సంక్రాంతికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంటారో.? లేదో.? వేచి చూడాలి.