న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్‌పాల్ (6), జాన్ కాంప్‌బెల్ (15) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అథనాజె (5), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (4) కూడా నిరాశ పరిచారు. దీంతో విండీస్ 72 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలోఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షాప్ హోప్ తనపై వేసుకున్నాడు. అతనికి జస్టిన్ గ్రీవ్ 55(బ్యాటింగ్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో అజేయంగా 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.