మారేడుమిల్లి ‘ఎన్‌కౌంటర్’పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఎపి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.జగన్నాధరావు, వై.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ‘ఎన్‌కౌంటర్’పై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల బృందం శుక్రవారం నిజనిర్ధారణ కోసం అక్కడికి వెళ్లిందన్నారు. 12 మంది విద్యార్థులు, జీప్ డ్రైవర్, వారికి సహాయంగా వచ్చిన ఒక ఆదివాసీ యువకుడు మొత్తంగా 14 మందిని ఎలాంటి చట్టబద్ద కారణం లేకుండా ఎపి పోలీసులు అడ్డగించి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ద హక్కులను కాలరాయడమేనని, ఈ విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.