నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ-2’. 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా విడుదలపై కొన్ని గంటలుగా సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు కూడా రద్దు కావడంతో ఈ సినిమా సమస్యల్లో పడిందనే వార్తలకు మరింత బలం చేకూంది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
‘‘అనివార్య కారణాల వల్ల ‘అఖండ-2’ షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైంది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి కలిగే నిరాశను మేం అర్థం చేసుకుంటాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం’’ అని 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.