అమరావతి: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మెగా పిటిఎం సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని అన్నారు. చిలకలూరి పేటలో శ్రీశారదా జెడ్పి ఉన్నత పాఠశాలలో టీచర్, పేరెంట్స్ మీటింగ్ లో పవన్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని ప్రధాని నరేంద్రమోడీకి విన్నివించానని, కూటమి నాయకులు పిల్లలకు గ్రంథాలయం సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులు పరిశీలించాలని పవన్ సూచించారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని అన్నారు. స్కూల్ క్రీడా మైదానం సరిపోవట్లేదని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని తెలియజేశారు. మెగా పిటిఎం సమావేశానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, శ్రీశారదా జెడ్పి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పిల్లల ఆలోచనలు మెరుగుపరిచేందుకు గ్రంథాలయం ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు జనసేన నేతలు కృషి చేయాలని పవన్ ఆదేశించారు.