బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ది గబ్బా వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, జేక్ వెదరాల్డ్ అరుదైన రికార్డును సాధించారు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌కి వీరిద్దరు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై డే అండ్ నైట్ టెస్ట్‌లో తొలి వికెట్‌కి అత్యధిక పరుగులు జోడించిన జోడిగా అరుదైన ఘనతను సాధించారు. గతంలో ఈ రికార్డు టీం ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి 2021 అహ్మదాబాద్ టెస్ట్‌లో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ గడ్డపై తొలి శతకం సాధించిన జో రూట్(138) అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మరోసారి విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ని ఆసీస్ కూడా ధాటిగా ప్రారంభించింది. ఆరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన జేక్ వెదరాల్డ్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ట్రావిస్ హెడ్ అతనికి చక్కగా సహకరించాడు. అయితే 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హెడ్ ఔట్ అయ్యాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అర్థశతకం సాధించి వెదరాల్డ్(72) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. క్రీజ్‌లో లబుషేన్(35), స్మిత్(4) ఉన్నారు. ఆసీస్ ఈ ఇన్నింగ్స్‌లో 179 పరుగుల వెనుకంజలో ఉంది.