మావోయిస్టుల ఉద్యమం ప్రస్తుతానికి అంతమై పోయినట్లే. ఇప్పట్లో దానికి పునరుజ్జీవం కలిగించేలా విప్లవకాంక్షతో రగిలేవారెవరూ కన్పించడం లేదు. ఒక శకం సమాప్తమైందనే నిర్ధారణలు జరుగుతున్నాయి. చారుమజుందార్, బస్వరాజ్ నుంచి హిడ్మావరకు విప్లవ వీరులు చేసిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రస్తుత తరానికి అర్ధమయ్యే భాషలో ప్రచారం జరగవలసి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. జానపద కథలలో వీరుల వలె వారి చరిత్ర ఉబుసుపోకకు పరిమితం కాకూడదు.స్ఫూర్తి రగిలించాలి. మేధావి వర్గాలు ఆ బాధ్యత స్వీకరించాలని కొందరు విప్లవాభిమానులు కోరుతున్నారు. కాగా సామాజిక కార్యకర్త, ఆదివాసీ పోరాటాలు నిర్వహిస్తున్న సోనీ సోరీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చినపుడు రచయిత్రి రూపకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లొంగిపోతున్న మావోయిస్టులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది బతుకు పోరాటం. లొంగిపోయే ఆలోచన వుంటే మా దగ్గరకు ఎందుకొచ్చారు? ఇన్నేళ్లు మాకోసం పోరాటం చేసి, ఇవాళ మాతో కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందు ఎలా లొంగిపోతున్నారు? హిడ్మా మా ఆదివాసి బిడ్డ. అతను మరణిస్తే మేమే కదా నష్టపోయేది?’ ఆమె ఈ ప్రశ్నలు సంధించిన పది రోజుల్లో నవంబర్ 18 వ తేదీ తెల్లవారుఝామున ఆదివాసీ కథానాయకుడు హిడ్మా జీవితం ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ రూపంలో తెల్లారిపోయింది. సోనీ సోరి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? ఏవిధంగా జవాబులు చెప్పినా అవి ’కన్విన్సింగ్’గా ఉండే అవకాశాలు లేవు. మావోయిస్టులు 2000 నుంచి బలం పుంజుకున్నారు.
వారి కార్యకలాపాలు తూర్పున నేపాల్ సరిహద్దు నుండి దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు నడిచాయి. – ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు దండకారణ్యం లేదా డీకే అని పిలిచారు. ఇది భారతదేశ స్థానిక ప్రజలు, ఆదివాసీలు నివసించిన ప్రాంతం. ఇక్కడ విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. భారత రాష్ట్రం సహజ వనరుల సంపదపై నియంత్రణ కోరుకుంది. కానీ మావోయిస్టులు దానికి అడ్డంకిగా మారారు. అప్పుడు, భారతదేశానికి ’అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు’ అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 లో ప్రకటించారు. కాగా 2020 నుంచి మావోయిస్టు ఉద్యమం క్షీణించడం వేగంగా జరిగింది. మావోయిస్టులను వేటాడేందుకు ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులతో సహా ఆదివాసీల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. 2018లో గణపతి నుండి మావోయిస్టు చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన నంబాల కేశవ రావు గత మే 21 న పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. నవంబర్ 18 న హిడ్మా ఎన్ కౌంటర్ జరిగింది. కొద్దీ మంది మినహాయించి మొత్తం మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. గత సెప్టెంబర్లో మల్లోజుల వేణుగోపాల అలియాస్ అభయ్ విడుదల చేసిన ప్రకటనలో నాయకత్వం అనేక వ్యూహాత్మక తప్పులు చేసిందని, రక్తపాతాన్ని ఆపడానికి ఇప్పుడు కాల్పుల విరమణ ముఖ్యమని ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మావోయిస్టుల అణచివేత కార్యకలాపాలు కొనసాగుతున్నందున, అడవిలో ఇంకా కొంతమంది చివరికి లొంగిపోతారు లేదా చంపబడతారు.
అయితే ఇంతటితో విప్లవ రాజకీయాలు అంతమయిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విప్లవోద్యమ ప్రభావం, పరిధి చాలా విస్తారమైంది. దేశంలో పైపై మెరుగులను చూసి నక్సల్ బరీ సాయుధ పోరాట రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని వీలునామా రాస్తున్నారు. కానీ నిజానికి పేట్రేగుతున్న ఫాసిస్టుల నేపథ్యంలో ఆ రాజకీయాలకున్న ఆవశ్యకత మరే రాజకీయాలకూ లేదు. అయితే కేవలం విప్లవోద్యమమే ఫాసిజాన్ని ఓడిస్తుందనే భ్రమలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఐక్య సంఘటన రాజకీయాలే ఫాసిజాన్ని, అది ఇప్పుడు కగార్ రూపంలో కొనసాగిస్తున్న దాడిని నిలువరించగలుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘పేదవాడి దృష్టిలో అన్నలు పేద ప్రజల కోసం ప్రాణాలను పూచికపుల్లతో సమానంగా ఆహుతి చేసుకొన్నవాళ్లు. ఇప్పటి సమాజానికి, సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయడమనే భావజాలం అర్ధం కాకపోవచ్చు. కానీ నక్సలైట్లు చేసింది అదే. పోలీసులను చంపారంటే, వారి మీద కక్షతో కాదు, యుద్ధంలో పోలీసులు శత్రువులు కాబట్టి చంపక తప్పదు. జరిగింది అణగారిన వర్గానికి, అణిచివేసే రాజ్యానికి మధ్య సమరం మాత్రమే. అందులో అటు ఇటు సమిధలు ఆహుతి కావడం సహజ పరిణామం. పోలీసులను చంపారు కాబట్టి నక్సలైట్లను నరహంతకులుగా ప్రచారం చేస్తున్నారు’ అని రచయిత మల్లాప్రగడ రామారావు ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
లొహండిగూడలో 2005లో టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పేరుతో భూముల ఆక్రమణకు దిగినప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ ఉనికే లేదు. అయినా సరే.. ప్రతిఘటించకపోతే భూములు దక్కవని, భూములు కోల్పోతే వలస కూలీలుగా మారిపోయి దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుందనే ఎరుకే వారిని చేతికి అందిన పనిముట్టునే ఆయుధంగా మల్చుకొని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇలాంటి గొప్ప వారసత్వం గల గడ్డపైన 1970 దశకం చివరలో, దక్షిణ బస్తర్లోని పువ్వర్తి అనే ఒక మారుమూల పల్లెలో హిడ్మా పుట్టాడు. బాల్యం అంతా ప్రజాపోరాటాల మధ్యే గడిచింది. 1996 లేదా 1997లో హిడ్మా దళంలో చేరాడు. దళంలో ఉంటూ ఏ ఆయుధాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ప్రజలే హిడ్మా బలం. ఆ ప్రజలకు హిడ్మా బలం. వాళ్లే ఆయనకు కళ్లూ, చెవులూ, కాళ్లూ, చేతుల్లా పని చేశారు. ఎందుకంటే, తమ గ్రామాలను తగులబెట్టి, ఆడపడచులను రేప్ చేసి, తమ బిడ్డలను హత్య చేస్తున్న సల్వాజుడుం గుండాలను, ప్రభుత్వ సాయుధ బలగాలను శిక్షించగల హీరోగా ప్రజలు ఆయనను చూశారు. హిడ్మా, ఆయన సహచరి రాజెల శవాల పక్కన రోదించినవాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.
ఇదిలా ఉండగా కోల్కతాలో మావోయిస్టు విద్యార్థి రాజకీయాలు బహిరంగంగా పునరుజ్జీవింపబడటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో నవంబర్ 24న తన ఆరవ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి ’మల్లోజుల కోటేశ్వర్ రావు నగర్’గా పేరు పెట్టారు. ఆడిటోరియంకు ’బసవరాజు’ పేరు పెట్టారు. ’వివేకానంద హాల్ను ’హిడ్మా స్టేజ్’గా పేరు మార్చారు. ’అడవిలో సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా నీరు, అడవి, భూమి హక్కులను పరిరక్షించినవారికి ఇది మా నివాళి. రాష్ట్ర ప్రభుత్వం మాపై పగ పడుతుందని, మాపైకి వస్తుందని మాకు తెలుసు’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులతోపాటు సంగ్రామి శ్రామిక్ మంచ్, సంగ్రామి కృషక్ మంచ్ సభ్యులు ప్రసంగాలు చేశారు. అడవుల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ, పట్టణ విద్యార్థి సమాజంలో సైద్ధాంతిక ప్రభావం ఇప్పటికీ ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ విద్యార్థులలో మావోయిస్టుల ప్రభావం పునరుజ్జీవనమా లేక బలహీనమైన సమూహాన్ని ప్రేరేపించడమా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా సంస్థల ముందున్న సవాలు.
-జకీర్
(సీనియర్ పాత్రికేయుడు)