అమరావతి: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమపై విధి అసూయ చూపించింది. ఆధార్ కార్డులో పేరు సరి చేసుకుందామని వెళ్తుండగా వారిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జుత్తుక లీలా ప్రసాద్(21), జుత్తుక సౌమ్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని బర్మాకాలనీలో ఇద్దరు ఉంటున్నారు. ఈ జంటకు మూడు నెలల క్రితం ఓ పాప జన్మించింది. లీలా ప్రసాద్ ఎలక్ట్రీక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆధార్ తప్పులు సరి చేయించుకోవడంతో రాజానగరం వచ్చారు. నరేంద్రపురం రోడ్డు దాటుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ప్రేమజంట ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.