రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తొలిదశలో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29 వరకు తొలి విడత పోలింగ్‌కు నామినేషన్లు స్వీకరించారు. అందులో బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 13,127 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 37,440 వార్డు స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8,095 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. రెండో విడత నామినేషన్ల గడువు ఈనెల 2వ తేదీతో ముగియగా, ఉపసంహరణకు శనివారం(డిసెంబర్ 6) వరకు గడువు ఉంది.
ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు..?
రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు కొందరు బడా వ్యాపారులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్‌ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.
కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు.