ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. గురువారం రాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.