తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బిజెపి నేతలపై కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి ఒక బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. ఒకటే స్క్రిప్ట్‌ను కెటిఆర్, కిషన్ రెడ్డిలు జీరాక్స్ చేసి చదువుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బ్రతికే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.
హైదరాబాద్‌ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్‌రెడ్డి, కెటిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డికి చిట్టీలు అందించేది ఎవరో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వలంటరీగా వెసులుబాటు ఇస్తే కెటిఆర్‌కు ఇబ్బంది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని, దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బిజెపి నాయకులు మౌనంగా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అన్నారు. బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని ఆయన తెలిపారు.