హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సిఎం కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో సిఎం పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. రూ. 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే అంగీకరించారని, విమానాశ్రయానికి వెంటనే 800 ఎకరాల భూసేకరణకు సిఎం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సిఎం ను కలుస్తానని చెప్పారు. చనాఖా- కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబీన్ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని పాయల్ శంకర్ తెలియజేశారు.