భౌగోళిక, రాజకీయ, దేశీయ పరిణామాల కారణంగా మన దేశ కరెన్సీ రూపాయి మారక విలువ ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు గురవుతోంది. డాలర్‌లో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గత కొద్ది రోజులుగా అమెరికన్ కరెన్సీ ముందు అనేక కుదుపులకు బక్కచిక్కి మంగళవారం నాటికి చారిత్రకంగా కనిష్ఠ స్థాయికి పడిపోవడం గమనార్హం. గత కొద్ది నెలలుగా డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దాంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. గత నెల 21న ఒక్క రోజే 98 పైసలు దిగజారడం గమనార్హం. భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడంతోపాటు ఇతర కారణాల కూడా ఈ పరిస్థితికి దోహదం చేశాయి. ఎగుమతి వృద్ధి మందగించడంతో వాణిజ్య లోటు పెరుగుతుండడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థిక వేత్త మదన్‌సబ్నవిస్ అభిప్రాయం వెలిబుచ్చారు. దేశీయంగా వృద్ధి మందగించడం, వాణిజ్య లోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం తదితర కారణాలు రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి.
గత ఏడాది కూడా ఇదే డిసెంబర్ నెలలో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 85.20 కి కనిష్ఠ స్థాయికి చేరింది. అంటే గత ఏడాది డిసెంబరు నెలలోనే రెండుసార్లు రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే బాగా క్షీణించిందని స్పష్టమవుతోంది. గడచిన ఐదేళ్లలో రూపాయి విలువ 20 శాతం క్షీణించగా, వచ్చే ఐదేళ్లలో ఇదే స్థాయిలో పతనం కావచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ 100 కు పడిపోవచ్చని నివేదికలు జోస్యం చెబుతున్నాయి. 2019 లో డాలరుతో రూపాయి మారకం విలువ 70 స్థాయిలో ఉండగా, మోడీ ప్రభుత్వకాలంలో 20 శాతం పతనమై ఇప్పుడు 90 స్థాయికి దిగజారింది. ఈ నేపథ్యంలో 2029 డిసెంబరు నాటికి 8788 స్థాయిల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రూపాయితోపాటు కొరియన్ వోన్, మలేసియన్ రిగింట్స్, ఇండోనేషియా రూపాయి విలువలు కూడా హెచ్చుతగ్గులవుతున్నాయి. అయితే ఇవేవీ అంతర్జాతీయ మారకపు కరెన్సీలుకావు. కేవలం డాలర్‌కే ఆ ప్రాధాన్యం ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరు ఒక్కటే లింకు కరెన్సీ. అంతర్జాతీయ మార్కెట్‌లో లావాదేవీలన్నీ డాలర్ల లోనే జరుగుతాయి. దిగుమతి సరకులన్నిటికీ డాలర్ లోనే చెల్లింపులు జరగాలి. మన ఎగుమతులు మన అవసరానికి మించి డాలర్లను సంపాదించినప్పుడే అంతర్జాతీయ వాణిజ్య లోటు తొలగుతుంది. లేదా పరిమితమవుతుంది. అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిడి అంటే అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల కలిగే ఒత్తిడి. స్వదేశంలో ద్రవ్యోల్బణాన్ని పరిమితిలో ఉంచుకోడానికి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంటుంది. మన రూపాయితోపాటు వర్ధమాన దేశాల కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమం లోనే మనదేశంలో గత ఏడాది డిసెంబర్ 18న 84.94 స్థాయిలో ఉన్న రూపాయి మారకం విలువ డిసెంబర్ 19 ఉదయానికి 85.06 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. వరుసగా రూపాయి పతనం వల్ల దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి.
విదేశీ చదువులు, అంతర్జాతీయ ప్రయాణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పుదినుసులు తదితర ధరలు భారీగా పెరుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వీసాలు, వసతి కోసం వారి తల్లిదండ్రులు భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి నగదును డాలర్ల లోకి మారిస్తే మరిన్ని ఎక్కువ రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. మనం దిగుమతి చేసుకునే చమురుకు కూడా డాలర్ల లోనే చెల్లింపులు చేస్తుంటాయి. దీనివల్ల ఖజానాపై భారం పడడమే కాకుండా పెట్రోలు, డీజిల్ ధరలు మరింత పెరుగుతున్నాయి.అనవసరమైన దిగుమతులను మానుకోవడమో, తగ్గించుకోవడమో చేస్తే డాలర్‌తో రూపాయి పతనాన్ని పరిమితం చేయవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు 2022 లో మే నెలలో 107 టన్నుల బంగారాన్ని మనదేశం దిగుమతి చేసుకుంది.
బంగారాన్ని డాలర్లు చెల్లించి తెచ్చుకోవలసి ఉంటుంది. అది అవసరమైన దిగుమతి కాదు కాబట్టి దాని దిగుమతిని నిరుత్సాహ పర్చడం ద్వారా డాలర్లను పొదుపు చేయాలని భావించి దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. మన దిగుమతుల్లో ముఖ్యమైనది క్రూడాయిల్. పెట్రోల్, డీజిల్‌కు మూలమైన క్రూడాయిల్ 85 శాతం ఇతర దేశాల వద్ద అంతర్జాతీయ రేటుకు విదేశీ మారక ద్రవ్యంతో కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నాం. దాని రేటు పెరిగే కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని అమితంగా చెల్లించవలసి వస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర అనూహ్యంగా పెరుగుతోంది. మనం దిగుమతి చేసుకుంటున్న సరకులను స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగితే రూపాయి పతనం నుంచి రక్షణ పొందవచ్చు. ఇదిలా ఉండగా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ప్రధాని మోడీ పదేపదే ప్రచారం చేస్తున్నా, అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే పరిస్థితి ఇంకా మనకు ఏర్పడలేదు. నాణ్యమైన సరకులను ఉత్పత్తి చేయగలిగితేనే వాటికి విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఆమేరకు మనదేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.